ఓ జైలు ప్రేమ కథ

Must read

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అసాధారణ ప్రేమకథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ముస్లిం మహిళ, గతంలో హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన హిందూ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. మత భేదాలు, కుటుంబ వ్యతిరేకత, సామాజిక ఒత్తిళ్లను అధిగమించి జరిగిన ఈ వివాహం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. రేవా ప్రాంతానికి చెందిన ఫిరోజా సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ జైలర్‌గా పనిచేస్తున్నారు. జైలులో ఖైదీలకు సంబంధించిన వారెంట్లు, పరిపాలనా అంశాల బాధ్యతలను ఆమె నిర్వహించేవారు. అదే జైలులో ధర్మేంద్ర సింగ్ చాండ్లా అనే వ్యక్తి హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవించాడు. అయితే జైలులో ఉన్న సమయంలో అతను మంచి ప్రవర్తన కనబరిచినట్లు అధికారులు చెబుతున్నారు. పరిపాలనా పనుల్లో కూడా జైలు సిబ్బందికి సహాయం చేస్తూ ఉండేవాడని సమాచారం.

ఈ క్రమంలో ఫిరోజా, ధర్మేంద్ర మధ్య పరిచయం ఏర్పడింది. మొదట అధికారికంగా ప్రారంభమైన ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. జైలులో తరచూ పరిపాలనా పనుల సందర్భంలో ఇద్దరూ మాట్లాడుకునేవారని తెలుస్తోంది. కాలక్రమేణా వారి మధ్య భావోద్వేగ అనుబంధం పెరిగి అది ప్రేమగా మారినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ధర్మేంద్ర జైలు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, అతని ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఫిరోజాపై ప్రభావం చూపినట్లు సమాచారం. మరోవైపు ఫిరోజా తనను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచిందని ధర్మేంద్ర భావించాడని చెబుతున్నారు. ఈ అనుబంధం పెరిగి ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మత భేదాలు, ధర్మేంద్ర గతం, సమాజంలో వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ పెళ్లికి ఫి రోజ కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఫిరోజా తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం.

ఇటీవల మే 5న ఛతర్‌పూర్ జిల్లాలోని లవకుశ్‌నగర్‌లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించడం విశేషంగా మారింది. వేద మంత్రాల నడుమ, అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి ఫిరోజా కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదని తెలుస్తోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫిరోజా కుటుంబ సభ్యుల స్థానంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ముందుకు వచ్చి కన్యాదానం నిర్వహించారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రేమకు మతం, గతం అడ్డుకాదని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు జైలు అధికారిణి ఒక మాజీ ఖైదీని వివాహం చేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరు అయితే వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో గత కొన్నేళ్లుగా అంతర్మత వివాహాలు పెరుగుతున్నప్పటికీ, వాటిపై సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ, పరస్పర అంగీకారం ఆధారంగా యువత తమ నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!