ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించడం మా విధానం :తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Must read

ఫార్మా సిటీ రైతుల పక్షాన రణం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది” అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మా సిటీ భూసేకరణ కోసం తెచ్చిన జీవో 31 ను రద్దు చేయాలన్నారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులను ఆగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫార్మాసిటీ భూముల విషయంలో గత ప్రభుత్వం నిసిగ్గుగా అబద్దాలు చెబితే…అవే అబద్దాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని మండిపడ్డారు. నిజం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వాలకు లేదన్నారు. ఫార్మా సిటీ భూముల విషయంలో తెలంగాణ రక్షణ సేనయే ముందుండి బాధితుల తరఫున కొట్లాడుతుందని చెప్పారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం అనే విధానంతో తాము ముందుకు వెళ్తున్నామని… ఫార్మా సిటీ బాధిత రైతుల సమస్య పరిష్కరించే వరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు.

ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రైతులకు వెంటనే ఇచ్చేయాలని కవిత అన్నారు. రైతుల అంగీకారం లేకుండానే వారి భూములను సేకరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ లో భూముల సేకరణ కోసం జీవో 31ను తీసుకొచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పి…అధికారంలోకి వచ్చాక రైతుల మోసం చేస్తుందన్నారు.

జీవో 31 రద్దు చేయకపోగా ప్యూచర్ సిటీ పేరుతో భూ సేకరణను 13,500 ఎకరాల నుంచి 30 వేల ఎకరాలు చేశారన్నారు. గత ప్రభుత్వం నిసిగ్గుగా ఫార్మాసిటీ కోసం 13 వేల 5 వందల ఎకరాలు సేకరించినట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ దాంట్లో కందుకూరు మండలంలో 3500 ఎకరాలు, యాచారం మండలంలో 6500 ఎకరాలు అసైన్డ్ భూమే ఉందని కవిత చెప్పారు.

వాటికి సంబంధించి కోర్టులో స్టే ఉన్న సరే బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కచేయలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతూ కోర్టును, ప్రజలను మోసం చేస్తుందన్నారు. కోర్టులో ఫార్మా సిటీ కొనసాగిస్తామని చెబుతూ…బయట మాత్రం రేవంత్ సర్కార్ ప్యూచర్ సిటీ కోసం ఈ భూముల సేకరణ మొదలు పెట్టిందని విమర్శించారు.

మన సమస్యలు తీరాలంటే పోరాటమే శరణ్యమని కవిత అన్నారు. వేరే పార్టీల సంగతి ఎలా ఉన్న సరే తాము మాత్రం ఫార్మా సిటీ రైతుల కోసం ముందుండి కొట్లాడతామన్నారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించడం తమ విధానమని చెప్పారు. వెలుగుమట్లలో సమస్య పరిష్కరమయ్యే వరకు నిరాహార దీక్షకు కూర్చోవడంతోనే బాధితులకు న్యాయం జరిగిందన్నారు.

మొండి ప్రభుత్వాలు దిగిరావాలంటే జగమొండిగా ఉండాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలో కలిసి కట్టుగా నిర్ణయం తీసుకోని ముందుకు వెళ్దామన్నారు. మనం గట్టిగా కొట్లాడకపోవటంతోనే కోర్టులో స్టే ఉన్న కూడా ఈ ప్రభుత్వాలు లెక్క చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిద్దామని సూచించారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలందరినీ మోసం చేస్తోందని కవిత అన్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తోందని, 6 లక్షల కోట్ల ఎంఓయూలు, డేటా సెంటర్లు అంటూ అబద్దాల పునాదుల మీద ప్యూచర్ సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్నారని చెప్పారు. డేటా సెంటర్ల పేరుతో ప్రజలను కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తారా అని ప్రశ్నించారు. ప్యూచర్ సిటీపై ఫోకస్ పెడితే హైదరాబాద్ కోర్ సిటీ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు.

ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్న మాటలు వచ్చాయన్నారు. కానీ ఈ విషయాన్ని ఏ మీడియా రాయలేదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పంట కొనుగోళ్లు ఉండవన్నారు. అందుకోసం ముగ్గురు మంత్రులతో రేవంత్ రెడ్డి కమిటీ వేశారని కవిత చెప్పారు. ఆ కమిటీ ఈ ఏడాది రైతుల పంట కొనుగోలు చేయాలని సూచించిందని… కానీ వచ్చే ఏడాది నుంచి పంట కొనుగోళ్లు ఉండవన్నారు. చాలా విషయాల్లో ప్రభుత్వం ఇదే విధంగా మోసాలకు పాల్పడుతుందని… ప్రజలకు నిజాలు చెప్పే దమ్ము లేదా అని కవిత పశ్నించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!