విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

Must read

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటు అంశం రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇప్పటివరకు రాకపోవడంతో రాజకీయ వివాదం ఇప్పుడు న్యాయపోరాటం దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా తన మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిందేనన్నారు. రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

“ఎవరికి మెజారిటీ ఉందో సభలోనే తేలాలి. ముందుగానే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరైన విధానం కాదు” అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రజలు అత్యధిక స్థానాలు ఇచ్చిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య సంప్రదాయమని ఆయన గుర్తుచేశారు.

టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ అయిన 118కు కావాల్సిన సంఖ్య ఇంకా లేకపోవడంతో, సరైన మద్దతు లేఖలు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించలేమని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

దీనిపై విజయ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సభలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే తమ బలం నిరూపించగలమని టీవీకే నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు కూడా విజయ్ వివరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో టీవీకే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టులోని చారిత్రాత్మక ఎస్.ఆర్. బొమ్మై కేసు తీర్పును ఆధారంగా చేసుకుని న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రకాశ్ రాజ్ కూడా గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియాలో కూడా “ఫ్లోర్ టెస్ట్‌కు అవకాశం ఇవ్వాలి” అనే డిమాండ్ వేగంగా ట్రెండ్ అవుతోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!