నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్లను మార్చారు. గురువారం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆపరేషన్ సిందూర్ జ్ఞాపకార్థం రూపొందించిన ప్రత్యేక చిత్రాన్ని ప్రొఫైల్ ఫోటోగా ఉంచగా, ఆయనను అనుసరిస్తూ కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కూడా తమ డీపీలను మార్చారు.
గతేడాది మే 6-7 తేదీల్లో భారత సాయుధ బలగాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో కీలక సైనిక చర్య చేపట్టాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత స్వీకరించింది.
ఈ ఆపరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, ‘ఆపరేషన్ సిందూర్’ జాతీయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కఠిన వైఖరిని ప్రపంచానికి చాటిచెప్పిందని వెల్లడించింది. ఈ సందర్భంగా భారత సైన్యం ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది.
ఆ వీడియోలో ప్రధాని మోదీ గతంలో చేసిన కీలక వ్యాఖ్యలను పొందుపరిచారు. “పహల్గామ్ దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని, వారిని ప్రోత్సహించే వారిని భారత్ గుర్తించి శిక్షిస్తుంది” అని ప్రధాని హెచ్చరించిన సందేశాన్ని అందులో ప్రదర్శించారు.
భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతోందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఈ ఆపరేషన్ మరోసారి స్పష్టం చేసిందని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.





