ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన, ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.
పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, భూముల కేటాయింపులు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్ర యువతకు శాశ్వత ఉపాధి లభించేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఉండాలని, యువతకు నేరుగా ప్రయోజనం చేకూరాలని సూచించారు.
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేస్ పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రసంగంపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఇలాంటి వేదికలపై రాజకీయ ప్రసంగాలు చేయడం కన్నా, గూగుల్ ద్వారా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు, ఏ రంగాల్లో, ఎంతకాలంలో లభిస్తాయో స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ప్రకటనలతో పాటు ఉపాధి అవకాశాలపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐటీ రంగంలో జరుగుతున్న భారీ స్థాయి ఉద్యోగ కోతలను (లే ఆఫ్స్) కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న ఈ సమయంలో, కొత్త పెట్టుబడులు యువతకు నిజమైన ఉపాధి అవకాశాలను కల్పించాలనే నమ్మకం కలిగించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్షం ఉపాధి అంశంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ రంగంలో కొత్త అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు.





