ప్రధాని నరేంద్రమోడీ క్రీడా స్ఫూర్తికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినోతాజాగా మోదీపై ప్రశంసలు కురిపించారు. సిక్కిం పర్యటనలో భాగంగా మోదీ చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న ఫొటోను చూసి ఆయన స్పందించారు.
మంగళవారం గ్యాంగ్‌టక్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, స్థానిక చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. అధికారిక కార్యక్రమాల మధ్య కొంత సమయం కేటాయించి పిల్లలతో కలిసి క్రీడలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
“ఈ రోజు నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ యువ మిత్రులతో గడపడం ఎంతో ఆనందంగా అనిపించింది” అంటూ మోదీ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు తక్షణమే వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మోదీ ఫొటోను షేర్ చేశారు. “ప్రధాని మోదీ మన అందమైన ఆటను ఆడటం చూడటం చాలా బాగుంది. ఫుట్‌బాల్ నిజంగా ప్రపంచాన్ని ఏకం చేస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సిక్కిం, మనీపూర్, మిజోరం వంటి ప్రాంతాల్లో ఫుట్‌బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా నిలిచింది. అక్కడి యువత ఫుట్‌బాల్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
మోదీ ఈ పర్యటనలో భాగంగా స్థానిక సంస్కృతి, క్రీడా సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలతో మమేకం కావడం విశేషం. ముఖ్యంగా చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ద్వారా క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని స్థాయిలో ఉన్న నాయకుడు ఇలా పిల్లలతో కలిసి క్రీడలో పాల్గొనడం యువతకు ప్రేరణగా నిలుస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా దోహదం చేస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.





