తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ అయ్యారు. హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు విడతల్లో సేవలు అందించారు.
ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్‌ల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి పంపించిన సంగతి తెలిసిందే. అందులో సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురిలో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో సీవీ ఆనంద్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఉన్నత విద్య, నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో పీజీ పూర్తి చేసిన సీవీ ఆనంద్ 1991లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలోనే పదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి కీలక ఆపరేషన్లను లీడ్ చేసినందుకుగాను 2002లోనే ప్రెసిడెంట్ గ్యాలెంటరీ మెడల్ ఆయనను వరించింది.
కేవలం శాంతిభద్రతలే కాకుండా, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడానికి ఈ కాలం పునాది వేసింది.హైదరాబాద్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో ఆయన ప్రవేశపెట్టిన మార్పులు నేటికీ ఆదర్శంగా ఉన్నాయి. నగరంలోని రోడ్లపై మృత్యుఘోషను తగ్గించేందుకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను కఠినతరం చేసి, జైలు శిక్షలు అమలు చేశారు.
టెక్నాలజీని వాడుకుంటూ ఈ-చలాన్, స్పీడ్ గన్ వ్యవస్థలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నప్పుడు షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ఐటీ కారిడార్‌లో మహిళలకు భరోసానిచ్చారు. ఎండలో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లకు సన్ గ్లాసెస్ పంపిణీ చేయడమే కాకుండా, వారికి 30 శాతం అదనపు పేమెంట్ వచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించి సిబ్బంది నేతగా పేరు తెచ్చుకున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిర్వహణ వంటి కీలక రంగాల్లో సవాళ్లు ఉన్న ఈ సమయంలో సీవీ ఆనంద్ నాయకత్వం కీలకంగా మారనుంది. ఆయన అనుభవం, పరిపాలనా నైపుణ్యం రాష్ట్ర పోలీసింగ్‌కు మరింత బలం చేకూర్చుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





