మానవత్వాన్ని మరిచిపోయేలా ప్రభుత్వ నిబంధనలు. నిబంధనలు ఎలా నిరుపేదల జీవితాలతో ఆడుకుంటాయో చూపించే హృదయ విదారక ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఓడిశా రాష్ట్రంలోని కియోన్‌ఝర్ జిల్లాలో ఓ గిరిజనుడు తన సోదరి అస్థిపంజరాన్ని భుజాలపై మోసుకుంటూ బ్యాంకుకెళ్లిన సంఘటన అందరినీ కదిలించింది.
వివరాల్లోకి వెళితే, జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే గిరిజనుడి సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం ముందే మరణించడంతో కుటుంబంలో జితు ఒక్కరే మిగిలాడు. కక్రా ముండా పేరుతో మల్లీపసి ప్రాంతంలోని ఓడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతాలో రూ.19,300 జమగా ఉన్నాయి.
ఆ డబ్బును తీసుకోవడానికి జితు బ్యాంకును సంప్రదించాడు. అయితే, బ్యాంకు మేనేజర్ నిబంధనల ప్రకారం ఖాతాదారు స్వయంగా రావాలని లేదా చట్టబద్ధమైన వారసత్వ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. చదువు లేని, వ్యవస్థల గురించి అవగాహన లేని గిరిజనుడైన జితుకు ఈ ప్రక్రియలు అర్థం కాలేదు. అవసరమైన పత్రాలు ఎలా పొందాలో తెలియక నిస్సహాయంగా తిరిగి వెళ్లిపోయాడు.
తర్వాత తన బాధను వ్యక్తపరచడానికి, వ్యవస్థపై నిరసన తెలియజేయడానికి అతను తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేసింది. తన సోదరి అస్థిపంజరాన్ని భుజాలపై మోసుకుంటూ సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు. అతని నిరుపేద పరిస్థితి, బాధను చూసి చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న కఠిన నిబంధనలు పేదలకు ఎలా ఇబ్బందులు కలిగిస్తున్నాయో ఈ సంఘటన స్పష్టంగా చూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నిబంధనలకే పరిమితమవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు లేవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజనుల మధ్య అవగాహన లోపం ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థలు మరింత సహానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పత్రాలు లేని సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూపడం, సహాయక చర్యలు చేపట్టడం అవసరమని గ్రామస్థులు సూచిస్తున్నారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించి, జితు ముండా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అవసరమైన పత్రాల ప్రక్రియను సులభతరం చేసి, అతనికి డబ్బు అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఒడిశాలో జరిగిన ఈ సంఘటన మన సమాజంలో నిబంధనలు, మానవత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. పేదలు, నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వ్యవస్థలో మార్పులు అవసరమనే సందేశాన్ని ఇది స్పష్టంగా అందిస్తోంది.





