అమెరికాలో జరిగిన కాల్పుల ఘటన మరోసారి భద్రతా వ్యవస్థలపై చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం సమీపంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వాషింగ్టన్లో జరిగిన వైట్ హౌస్ కరెస్పారెంట్ అసోషియేషన్ డిన్నర్ సందర్భంగా హోటల్ వెలుపల కాల్పులు జరగడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ఈ ఘటన శనివారం రాత్రి వాషింగ్టన్‌లోని వాషింగ్ టన్ విల్టన్ వద్ద చోటుచేసుకుంది. వందలాది మంది జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్న ఈ డిన్నర్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రంప్ వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా బయట నుంచి తుపాకీ శబ్దాలు వినిపించాయి.
ఈ కాల్పుల శబ్దాలు వినిపించగానే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలేనీయా ట్రంప్ ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ చర్యతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోటల్ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని అనుమానితులను వెతికే చర్యలు ప్రారంభించారు. ఈ కాల్పులకు బాధ్యుడిగా భావిస్తున్న వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషియల్ లో అనుమానితుడి ఫోటో, వీడియోను విడుదల చేశారు.
“ఇతడే ఆ మానసిక రోగి” అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై వివాదం కూడా చెలరేగింది. నిందితుడు అరెస్ట్ అయ్యే వరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం ప్రజలకు సమాచారం అందించడం అవసరమని అంటున్నారు.
ఈ ఘటనపై అమెరికా భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. కాల్పుల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఏదైనా వ్యక్తిగత కారణమా, లేక పెద్ద కుట్రలో భాగమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన మరోసారి ప్రముఖ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా భారీ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.





