తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ కమిటీ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. సమ్మెకు దారితీసిన మూడు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో వివాదం కొలిక్కి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మిక నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది.
ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ఒక నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విలీన నమూనాలను ఇప్పటికే అధికారులు అధ్యయనం చేశారని, ఆ నివేదికల ఆధారంగా ముందుకు వెళతామని మంత్రులు హామీ ఇచ్చారు. అలాగే కార్మిక సంఘాల (ట్రేడ్ యూనియన్) ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తన వైపు నుంచి అంగీకారం తెలిపింది.
యాజమాన్యంతో చర్చించి త్వరలోనే ఎన్నికల షెడ్యూలు ఖరారు చేసుకోవాలని సూచించింది. ఆర్టీసీ కార్మికులకు అత్యంత కీలకమైన 2021 మరియు 2025 వేతన సవరణ (పీఆర్సీ) బకాయిలు, ఫిట్మెంట్ను చెల్లించేందుకు ప్రభుత్వం ఆర్థికపరమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలతో సంతృప్తి చెందిన జేఏసీ ప్రతినిధులు సమ్మె విరమణపై అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు.
చర్చల సందర్భంగా కార్మికుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం గట్టి భరోసా ఇచ్చింది. భవిష్యత్తులో ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులు లేదా ఎలక్ట్రిక్ వాహనాలు ఎన్ని వచ్చినా ప్రస్తుత ఉద్యోగుల విధులకు ఎటువంటి ఆటంకం కలగదని మంత్రులు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 52 రోజుల పాటు సమ్మె చేసినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం చర్చలకు పిలవలేదని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని జేఏసీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం సమ్మె ప్రారంభమైన రెండో రోజే స్వచ్ఛందంగా చర్చలకు ఆహ్వానించడాన్ని వారు కొనియాడారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారుల కమిటీ వేగంగా స్పందించి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారని చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి తగ్గుతున్న ఆదాయాన్ని ప్రభుత్వం రీఇంబర్స్ చేస్తూ సంస్థను కాపాడుతోందని, కార్మికుల క్షేమంపై ప్రభుత్వానికి స్పష్టమైన చిత్తశుద్ధి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.
గతంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని అనిశ్చితి ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిందని, ఇప్పుడు పీఆర్సీ బకాయిలను కూడా ఒక షెడ్యూలు ప్రకారం విడుదల చేసేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిసింది.





