కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ నగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాల కోసం బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో జరిగిన భారీ పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన, వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని త్రిస్సూర్ ఎంపీ, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపిను ఆదేశించారు.
ప్రధాని ఆదేశాల మేరకు సురేశ్ గోపి హుటాహుటిన ఢిల్లీ నుంచి బయల్దేరినట్లు తెలిపారు. విమానంలో అక్కడికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో త్రిస్సూర్‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన “ఈ విషాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఏం వింటున్నానో నమ్మలేకపోతున్నాను. మాట్లాడటానికి మాటలు రావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో భారీ మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు తీవ్రతతో చుట్టుపక్కల ప్రాంతాలు దట్టమైన పొగతో కప్పుకుపోయాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.
త్రిస్సూర్ పూరం ఉత్సవం దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయ వేడుకల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. ఈ వేడుకల్లో బాణసంచా ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అయితే ఈసారి బాణసంచా తయారీ దశలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
సురేశ్ గోపి సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం స్థానిక అధికారులతో సమావేశమై సహాయక చర్యలను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.





