భారతదేశంలో మహిళా సాధికారతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సవరణ ద్వారా ఆమోదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి పరిధిలోని ఎంఎంసీ కార్పొరేటర్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ మద్దతును ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బలమైన మద్దతు తెలపాలని ఎంపీ ఈటెల రాజేందర్ ఇచ్చిన ఆహ్వానం మేరకు పలువురు కార్పొరేటర్లు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ ప్రాముఖ్యత, భవిష్యత్తులో మహిళల రాజకీయ పాత్ర, స్థానిక సంస్థల నుంచి జాతీయ స్థాయి వరకు మహిళల ప్రాతినిధ్యం పెంపుపై విస్తృతంగా చర్చలు జరిగాయి. మహిళలు రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొనడం ద్వారా దేశ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్పొరేటర్లు పార్లమెంట్లో జరిగిన చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ఓటింగ్ దృశ్యాన్ని చూడడం తమకు గౌరవంగా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో మహిళల సాధికారతకు ఇది దోపదపడుతుందని, ఈ బిల్లుతో మహిళలకు రాజకీయ రంగంలో మరింత అవకాశాలు లభిస్తాయని, ఇది సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, మీనా ఉపేందర్ రెడ్డి, కొంతం దీపిక, ఆకుల శ్రీవాణి, నర్మదా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారు కూడా ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ, మహిళల ప్రగతికి ఇది ఒక కీలక నిర్ణయమని పేర్కొన్నారు.





