హైదరాబాద్ శివారు చర్లపల్లిలో చోటుచేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి , ఆమె ఇద్దరు పిల్లల ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, తాజాగా బాధితురాలి భర్త చేసిన ఫిర్యాదుతో కేసు కొత్త మలుపు తిరిగింది.
ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17) చర్లపల్లి-ఘట్‌కేసర్ మధ్య గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుబాన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ ఘటన వెనుక ఆస్తి వివాదమే కారణమని భర్త సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాజాగా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన ఆయన తన అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, అతని భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వీరు ఆస్తి కోసం తన బార్య పిల్లల్ని వేదించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
“నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదు. వారిని సొంతవాళ్లే మోసం చేశారు. ఆస్తి కోసం నిరంతరం ఒత్తిడి తెచ్చి, మానసికంగా వేధించి చివరికి ఈ దారుణానికి కారణమయ్యారు” అని సురేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబంలో జరుగుతున్న ఈ వివాదాలు కొంతకాలంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
తన బార్య పిల్లలు చనిపోయిన 25 రోజులకే అత్తమామలు, బామ్మర్ది కలిసి ఆస్తి కోసం తనను బెదిరించడం ప్రారంభించారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు మరింత కీలకంగా మారింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును తిరిగి ప్రారంభించారు.ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని అందుకు సంబంధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికితీస్తామని పోలీసులు తెలిపారు.అవసరమైతే కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు హామి ఇచ్చారు.
కుటుంబ వివాదాలు, ఆస్తి సమస్యలు ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సరైన సహాయం అందకపోతే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటాయని పోలీసులు తెలిపారు. కుటుంబం అనేది ఆపదలో ఆదుకునేలా ఉండాలి కానీ అపదలను తెచ్చిపెట్టకూడదని పోలీసులు వివరించారు.





