దేశ న్యాయవ్యవస్థలో సంచలనం రేపిన ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై కొనసాగుతున్న అభిశంసన (ఇంపీచ్‌మెంట్) ప్రక్రియ మధ్యలో ఈ నిర్ణయం తీసుకోవడం న్యాయవ్యవస్థల్లో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తన రాజీనామా లేఖను ద్రౌపది ముర్ముకు పంపినట్లు సమాచారం. అదే సమయంలో ఈ లేఖ ప్రతిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు కూడా పంపించారు.
గతంలో వెలుగులోకి వచ్చిన ఒక సంచలన ఘటన. 2024 మార్చి 14న, జస్టిస్ వర్మ డిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో, ఆయన అధికారిక నివాసంలోని ఔట్‌హౌస్‌లో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఇవి భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నించేలా మారిన ఈ సంఘటన, రాజకీయ,న్యాయ రంగాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో 2025 జూలైలో లోక్‌సభలో 145 మంది, రాజ్యసభలో 63 మంది ఎంపీలు కలిసి జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని నోటీసులు ఇచ్చారు. దీని ఆధారంగా లోక్‌సభ స్పీకర్, Jజడ్జెస్ (ఇన్‌క్వైరీ) యాక్ట్, 1968′ ప్రరకారం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది.
అయితే, ఈ కమిటీ ఏర్పాటు ప్రక్రియను జస్టిస్ వర్మ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం—జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన బెంచ్—దాన్ని తిరస్కరించారు. అంతకుముందు సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ నివేదికను కూడా ఆయన సవాల్ చేసినప్పటికీ, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
ఈ పరిణామాల మధ్య జస్టిస్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేయడం కీలక మలుపుగా మారింది. రాజీనామా అనంతరం అభిశంసన ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉండదని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా పదవిలో ఉన్న న్యాయమూర్తులపై మాత్రమే అభిశంసన ప్రక్రియ అమలులో ఉంటుంది. ఒకవేళ వ్యక్తి ముందుగానే రాజీనామా చేస్తే, ఆ ప్రక్రియ ఆటోమేటిక్‌గా ముగిసే అవకాశం ఉంటుంది.
ఈ ఘటనపై రాజకీయ వర్గాలు కూడా విభిన్నంగా స్పందించాయి. కొందరు న్యాయవ్యవస్థపై మరింత కఠిన నియంత్రణ అవసరమని అభిప్రాయపడగా, మరికొందరు ఇది వ్యక్తిగత స్థాయిలో జరిగిన ఘటనగా మాత్రమే చూడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది.





