రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ సెట్లో స్వల్ప అగ్ని ప్రమాదం
చోటుచేసుకోవడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్లో లేకపోవడం డార్లింగ్ ప్రభాస్ కి పెద్ద ప్రమాదమే తప్పిందని అభిమానులు, చిత్రబృందం ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ సేఫగా ఉండడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నరు.
సెట్లో ఏర్పాటు చేసిన టెంట్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన ఈ అగ్ని, కొద్దిసేపటికే కొంత మేర వ్యాపించింది. చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకుని అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో యూనిట్‌కు చెందిన ఒక సభ్యుడు స్వల్ప గాయాలకు గురయ్యాడు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు యునిట్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చిత్రబృందం వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రమాదంలో కొన్ని టెంట్లు, షూటింగ్‌కు ఉపయోగించే పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే భారీ నష్టం ఏమీ జరగకపోవడంతో చిత్రబృందంకు కాస్తా ఊరట లభించింది. ముఖ్యంగా భారీ సెట్లు, విలువైన పరికరాలు పూర్తిగా నష్టపోకుండా ఉండడం సంతోషకరమని యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై చిత్రబృందం అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణాలపై చర్యలు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సెట్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని యూనిట్ నిర్ణయించుకుంది.
‘స్పిరిట్’ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేక శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.





