తెలంగాణలో మావోయిస్టుల ఏరివేత, పునరావాస ప్రక్రియలో మరో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థ చేపట్టిన చర్యలు ప్రభావంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు జన ప్రవాహంలోకి రావడానికి సిద్ధమయ్యారు.రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు.
లొంగుబాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఈ మావోయిస్టులు ఏ దళాలకు చెందినవారు? వారిలో కీలక నాయకులు ఉన్నారా? వారు ఎంతకాలంగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు? వంటి అంశాలపై స్పష్టత కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో తెలంగాణలో మావోయిస్టు లపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అడవులలో గస్తీ పెంచడం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గాలింపు చర్యలను ముమ్మరం చేయడంతో మావోయిస్టుల కదలికలను కట్టడి చేస్తున్నారు. దీనివల్ల మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్షణ ఆర్థిక సహాయం, నగదు ప్రోత్సాహకాలు, నివాస సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించివారిని సమాజంలో తిరిగి స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ పథకాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెరగడంతో, అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా తమ జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులతో తిరిగి కలుసుకోవడం, సాధారణ జీవితం గడపడం కోసం చాలా మంది లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ మార్పును సానుకూలంగా స్వాగతిస్తున్నారు. హింసకు బదులుగా శాంతి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా అభివృద్ధి దిశగా ముందుకు సాగవచ్చని భావిస్తున్నారు. లొంగుబాటు ప్రక్రియ విజయవంతం కావాలంటే పునరావాస పథకాలు పారదర్శకంగా అమలు కావాలి. లొంగిపోయిన వారికి సరైన ఉపాధి, జీవనోపాధి అవకాశాలు కల్పించకపోతే తిరిగి వారు అడవుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు.





