తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే జివన్ రెడ్డిను కలవనున్నారు. ఇందుకోసం కేటీఆర్ ఇప్పటికే జగిత్యాలకు బయలుదేరారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం వెనుక అంతర్గత విభేదాలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఈ సమయంలో కేటీఆర్ ఆయనను ప్రత్యక్షంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశమా, లేక రాజకీయ పరంగా కీలక నిర్ణయాలకు దారి తీస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
కేటీఆర్ రాక నేపథ్యంలో జగిత్యాల ప్రాంతంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. కేటీఆర్ జగిత్యాల శివారుకు చేరుకున్న వెంటనే బైక్ ర్యాలీ నిర్వహించి, అక్కడి నుంచి జీవన్ రెడ్డి నివాసానికి భారీ ర్యాలీగా వెళ్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ భేటీలో కేటీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీకి చేరితే స్థానికంగా బీఆర్ఎస్ బలపడే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు, జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆయన బీఆర్ఎస్‌లో చేరతారా, లేక ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఈ భేటీ తర్వాత ఆయన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే జయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం జీవన్ రెడ్డికి అసంతృప్తి కలిగించినట్లు సమాచారం. ఈ పరిణామాలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయించాయని సమాచారం.





