దేశవ్యాప్తంగా వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో భాగంగా, ముఖ్యంగా పట్టణాలు,నగరాల్లో నివసించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని 5 కిలోల ఎఫ్‌టీఎల్ స్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి, మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. దేశంలోని చమురు రంగ సంస్థల సహకారంతో పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ సిలిండర్లను సమర్థవంతంగా పంపిణీ చేయాలని
ఈ లేఖలో సూచించారు.
ఈ చర్య ప్రధానంగా వలస కార్మికుల జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోబడింది. పట్టణాల్లో నివసించే అనేక మంది కార్మికులు తాత్కాలిక నివాసాల్లో ఉంటారు. పెద్ద గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయడం లేదా నిల్వ చేయడం వారికి కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో, తక్కువ బరువు గల 5 కిలోల సిలిండర్లు వారికి అనుకూలంగా ఉంటాయి తెలిపారు.
ఈ చిన్న సిలిండర్లను సాధారణంగా “ఛోటు సిలిండర్లు” అని పిలుస్తారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, దేశీయ అవసరాలను తీర్చేందుకు ఈ విధమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నారు.
ఈ 5 కిలోల సిలిండర్లకు కనెక్షన్ పొందడం కూడా సులభంగా ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు కేవలం:
అడ్రస్ ప్రూఫ్
ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు
చూపిస్తే సరిపోతుంది. దీని ద్వారా వలస కార్మికులు, తాత్కాలికంగా నివసించే వారు, చిన్న కుటుంబాలు కూడా సులభంగా గ్యాస్ వినియోగం పొందగలుగుతారు.
అదనంగా, ఈ నిర్ణయం పర్యావరణ పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న సిలిండర్ల వినియోగం వల్ల వంట గ్యాస్ వినియోగం నియంత్రణలో ఉండటమే కాకుండా, ఇంధన వనరుల వినియోగంలో సమర్థత పెరుగుతుందని బావిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే, పట్టణాల్లో నివసించే లక్షలాది వలస కార్మికులకు ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. ముఖ్యంగా, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇది ఒక పెద్ద సహాయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.





