పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలు, సైనిక వ్యూహాలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీ వినియోగం కొత్త కోణాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా చైనాకు చెందిన పలు టెక్నాలజీ కంపెనీలు, అమెరికా సైనిక కదలికలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిఘా పెట్టుతున్నాయనే సమాచారం వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెలితే.., ఈ సంస్థలు ఎలాంటి గోప్యమైన డేటాను హ్యాక్ చేయకుండా, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం (open-source intelligence) ను విశ్లేషిస్తూ యూఎస్ సైన్యపు కదలికలను అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులు, ఉపగ్రహ చిత్రాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న ట్రాకింగ్ డేటా వంటి వనరులను ఉపయోగించి సైనిక మోహరింపులను గుర్తిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది కృత్రిమ మేధస్సు (ఏఐ). భారీ డేటాను తక్కువ సమయంలో విశ్లేషించే సామర్థ్యం ఉండటంతో, ఏఐ టూల్స్ ఈ పనిని మరింత వేగంగా, ఖచ్చితంగా నిర్వహిస్తున్నాయి. దీంతో యూఎస్ బలగాల కదలికలను దాదాపు రియల్ టైమ్‌లో ట్రాక్ చేయగలుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిణామం అమెరికాలో భద్రతాపరమైన ఆందోళనలకు దారితీసింది. సైనిక సమాచారం గోప్యతను కాపాడడం మరింత కష్టతరమవుతోందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ డేటాను ఉపయోగించి కూడా సైనిక వ్యూహాలను అంచనా వేయగలిగే పరిస్థితి ఏర్పడటం కొత్త సవాలుగా మారింది.
ఇక చైనా వైపు నుంచి ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే, టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉన్న చైనా కంపెనీలు ఏఐ వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి విశ్లేషణలు జరగడం సహజమేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి. ఆ ప్రాంతంలో యూఎస్ సైనిక కదలికలు పెరుగుతుండటంతో, ఇతర దేశాలు వాటిపై నిశితంగా గమనిస్తున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీ వినియోగం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వినియోగంపై కొత్త చర్చలకు దారితీసింది. ముఖ్యంగా ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు భద్రతా రంగంలో ఎలా ప్రభావం చూపుతున్నాయన్న అంశంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాకుండా డేటా, టెక్నాలజీ ఆధారంగా కూడా సాగుతాయన్న అభిప్రాయం బలపడుతోంది.
అమెరికా ఇప్పటికే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. సైనిక సమాచారం లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అలాగే బహిరంగ డేటా వినియోగంపై కూడా నియంత్రణలు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది.
ఏఐ ఆధారంగా సైనిక సమాచారం విశ్లేషణ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ప్రపంచ భద్రతా వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి. ప్రస్తుతం మాత్రం ఈ అంశం గ్లోబల్ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.





